భీకర వరదలలో మణిపుర్‌లోని నోనె పట్టణంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రైల్వే పనులు చేస్తున్న ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తుపుల్ యార్డ్ వద్ద బుధవారం రాత్రి జరిగింది. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకొని.. మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు.
ఈ శిథిలాల్లో అనేక మంది చిక్కుకున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. 45 మంది వరకు ఆచూకీ అభించలేదని నోనె జిల్లా ఎస్డీఓ సోలోమన్ ఫైమేట్ పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడటం వల్ల ఐజెయ్ నది ప్రవాహం ఆగిపోయిందన్నారు. వరద నీరు రిజర్వాయర్ లా మారిందని వివరించారు.
నీటి ప్రభావానికి శిథిలాలు ఒక్కసారిగా పక్కకు జరిగిపోతే.. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోతాయన్నారు. పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉందని వివరించారు. ప్రజలు ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జిరిబం, ఇంఫాల్ కొత్త లైన్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన తుపుల్ స్టేషన్ భవనం వరదలకు దెబ్బతిందని రైల్వే అధికారులు తెలిపారు. నిర్మాణంలో పాల్గొన్న కూలీల శిబిరాలు సైతం ధ్వంసమయ్యాయని వెల్లడించారు. సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టినట్లు స్పష్టం చేశారు. మణిపుర్ సీఎం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి నోనె ఆర్మీ మెడికల్ యూనిట్లో చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు అధికారులు.