ప్రధాని మోడీ డ్రెస్సింగ్ స్టయిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏదైనా రాష్ట్రానికి వెళ్తే అక్కడి వేషధారణ ఉండేలా చూసుకుంటారు. తలపాగా కానీ, కండువా గానీ, డ్రెస్ గానీ ఇలా ఏదో ఒక ప్రత్యేకత చాటుకుంటారు. తాను కూడా మీవాడినే అనే భావనను ఆయా రాష్ట్ర ప్రజల్లో కలిగేలా చేస్తుంటారు. తాజాగా రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ప్రధాని డ్రెస్సింగ్ స్టయిల్ వైరల్ అవుతోంది.
ఢిల్లీలోని రాజ్ పథ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ జెండు ఎగురవేశారు. అయితే.. అందరి దృష్టి ప్రధాని మోడీ వైపే ఉంది. ఆయన డ్రెస్సింగ్ స్టయిల్ పైనే దృష్టి మళ్లింది. దానికి కారణం ఉత్తరాఖండ్ టోపీ, మణిపూర్ కండువా.
రిపబ్లిక్ వేడుకల్లో ఉత్తరాఖండ్ సంస్కృతిని ప్రతిబింబించే మెరూన్ రంగు టోపీని ధరించారు మోడీ. దానిపై ఆ రాష్ట్ర చిహ్నమైన బ్రహ్మ కమలం ఉంది. అలాగే మణిపూర్ పర్యటనలో తనకు బహూకరించిన ప్రత్యేకమైన కండువాను కూడా మెడలో వేసుకున్నారు ప్రధాని.
మామూలుగా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల రోజున మోడీ విభిన్నమైన లుక్ లో కనిపిస్తుంటారు. కానీ.. ఈసారి ఓ ప్రత్యేకత ఉంది. ఉత్తరాఖండ్ టోపీ, మణిపూర్ కండువాను ధరించడంలో వేరే అర్థం ఉందని అంటున్నారు. వచ్చే నెలలో ఈ రెండు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ వాటిని ధరించారని మాట్లాడుకుంటున్నారు.