ఏడెనిమిది నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చినా తాను భయపడేది లేదని, నేను భగత్ సింగ్ అనుచరుడిలాంటివాడినని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ ఆదివారం ఆయనను విచారించనుంది.’ ఈ రోజు నేను మరోసారి సీబీఐ విచారణకు హాజరవుతున్నాను.. విచారణకు పూర్తిగా సహకరిస్తాను.. మరికొన్ని నెలలు జైల్లో ఉండాల్సి వచ్చినా లెక్క చేయను.. నేను భగత్ సింగ్ ను అనుసరించే వ్యక్తిని.. ఈ దేశం కోసం భగత్ సింగ్ ప్రాణాలర్పించారు ‘ అని ఆయన ట్వీట్ చేశారు. సిబిఐ కార్యాలయానికి వెళ్లేముందు ఆయన రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
ఆయన తన ఇంటి నుంచి బయలుదేరగానే పెద్ద సంఖ్యలో ఆప్ కార్యకర్తలు ఆయన వెంట వాహనాల్లో సాగుతూ.. ప్లకార్డులు చూపుతూ.. నినాదాలు చేశారు. ఓ రోడ్ షో మాదిరి సిసోడియా కాన్వాయ్ సాగింది. సిబిఐ .. తమ నేతను అరెస్టు చేయవచ్చునని ఆందోళన వ్యక్తం చేసిన ఆప్ నేతలు .. తమలో పలువురిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రధాని మోడీకి భయమని, అందుకే నన్ను తప్పుడు కేసులో ఇరికించారని సిసోడియా ఆరోపించారు. మొదటి నుంచి తనకు అండగా ఉన్న తన భార్య అస్వస్థురాలై ఇంట్లో ఒంటరిగా ఉందని, ఆమె బాగోగులను చూసుకోవాలని పార్టీ కార్యకర్తలను కోరుతున్నానని ఆయన అన్నారు.
ఇక కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ.. ‘మనీష్.. భగవంతుడు నీ వైపే ఉన్నాడని.. లక్షలాది పిల్లలు, వారి తలిదండ్రుల ఆశీస్సులు మీకున్నాయని పేర్కొన్నారు. ఇది శాపం కాదని, గొప్ప విజయావకాశమని అన్నారు. జైలు నుంచి మీరు త్వరలోనే రిలీజ్ కాగలరని ఆశిస్తున్నాను అని ఆయన అన్నారు.