ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రోజుకో దిగ్భ్రాంతికరమైన విషయం బయల్పడుతోంది. . ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తన ఫోన్లను ఎన్నో సార్లు మార్చారని, ఆధారాలను నాశనం చేశారని ఈడీ బుధవారం ఆరోపించింది. సిసోడియాతో బాటు ఢిల్లీ బిజినెస్ మన్ అమిత్ అరోరా 11 ఫోన్లను వాడారని, వాటిని ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చారని ఈడీ అధికారులు ఢిల్లీ కోర్టుకు తెలిపారు.
ఈ స్కామ్ జరుగుతున్న సమయంలో ఈ వ్యవహారం సాగినట్టు వారు పేర్కొన్నారు. సిసోడియా, అరోరా ఇద్దరూ సాక్ష్యాధారాలను నాశనం చేస్తూ వచ్చినట్టు వారు వెల్లడించారు.
వీరే గాక.. చాలామంది అనుమానితులు, మద్యం వ్యాపారులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా ఎన్నోసార్లు తమ ఫోన్లను మార్చారు.. దాదాపు రూ. 1.38 కోట్ల విలువైన ఫోన్లను మార్చారంటే నేరం ఎంత పెద్దదో చూడవచ్చు.. అని ఈడీ వివరించింది.
ఇక అమిత్ అరోరాను 7 రోజులపాటు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈయనను బుధవారం ఉదయం అరెస్టు చేశారు.