ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్త సంచలనం సృష్టిస్తోంది. నీకది..నాకిది అన్న చందాన ఈ స్కామ్ లో నిందితులంతా పరస్పరం కుమ్మక్కయి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించడం, జరిగిన కుట్రకు హైదరాబాద్ కేంద్ర స్థానం కావడంతో ముఖ్యంగా తెలంగాణాలో ఈ ఉదంతం హాట్ హాట్ గా మారింది. మనీష్ సిసోడియా, కవిత, దినేష్ అరోరా, బుచ్చిబాబు, రామచంద్ర పిళ్ళై, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, .. తదితరులంతా ఇలా ఈ స్కామ్ ని ‘దేశవ్యాప్తం’ చేశారు.
ఈడీ, సిబిఐ రంగంలోకి దిగి కోర్టుల్లో కేసులు పెట్టాయి. దర్యాప్తు రోజుకో రకంగా మలుపు తిరుగుతూ వస్తోంది. మనీలాండరింగ్ తో బాటు హవాలా సొమ్ములు కూడా చేతులు మారినట్టు తాజాగా తెలుస్తోంది. అరెస్టయిన సిసోడియా.. జైలు పాలై పదవికి రాజీనామా చేయగా ఆయన జ్యూడిషియల్ కస్టడీని తాజాగా కోర్టు ఈ నెల 17 వరకు పొడిగించింది. తప్పుడు లిక్కర్ పాలసీని రూపొందించిన సిసోడియా .. ఇతర నిందితులతో కలిసి సుమారు 290 కోట్లకు పైగా ముడుపుల సొమ్మును సేకరించారని ఈడీ ..కోర్టుకు తెలిపింది.
నిధుల జనరేషన్, బదిలీ, నేరాన్ని దాచిపెట్టేందుకు ఆయన చేసిన యత్నాలు ఇన్నీ అన్నీ కావని తన రిపోర్టులో పేర్కొంది. కవిత, మాగుంట తదితరుల ఆధీనంలోని సౌత్ గ్రూప్ రూ. 100 కోట్లను ఆప్ కిబదిలీ చేయడం వెనుక ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వానికి, వీరికి మధ్య రాజకీయ అవగాహన కుదిరినట్టు అనుమానించవలసి వస్తోందని వెల్లడించింది.
తమ ఆశ్రితులకు, బడా కాంట్రాక్టర్లకు మద్యం లైసెన్సులు లభించేలా పెద్ద ఎత్తున కుట్ర జరిగిన విషయం వాస్తవమని ఈడీ ఆరోపించింది. ఒక దశలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు సైతం తెలియకుండా ఈ యవ్వారం సాగిందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. కవితకు తాను బినామీనని మొదట చెప్పుకున్న పిళ్ళై..తరువాత మాట మార్చి దాన్ని ఉపసంహరించుకుంటానని పిటిషన్ వేశారు. అంటే ఆయన అప్రూవర్ గా మారతాడా అన్నది తేలాల్సి ఉంది. ఇన్ని చిక్కుముడుల మధ్య కవిత అండ్ కో ను శనివారం ఈడీ అధికారులు విచారించనున్నారు. మరి ఆమెను ఈడీ అరెస్టు చేస్తుందా లేక ఇది మరో మలుపు తిరుగుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.