ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నాయి కేంద్ర సంస్థలు. శనివారం ఢిల్లీ సచివాలయానికి వెళ్లారు సీబీఐ అధికారులు. ఈ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కార్యాలయంలో తనిఖీలు జరిపారు. దీనిపై మనీశ్ సిసోడియా తనదైన రీతిలో స్పందించారు.
“సీబీఐ అధికారులు మళ్లీ నా కార్యాలయానికి వచ్చారు. మా ఊర్లోనూ విచారణ జరిపారు. నాకు వ్యతిరేకంగా వారికి ఏమీ లభించలేదు. ఎందుకంటే నేను ఎలాంటి తప్పిదానికి పాల్పడలేదు కాబట్టి” అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు సిసోడియా.
మరోవైపు ఈ వ్యాఖ్యలను ఖండించారు సీబీఐ అధికారులు. తాము సిసోడియా కార్యాలయంపై ఎలాంటి దాడులు చేయలేదని స్పష్టం చేశారు. మద్యం పాలసీకి సంబంధించిన కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకునేందుకే వెళ్లామని తేల్చి చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై అటు ఈడీ, ఇటు సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. సౌత్ గ్రూప్ అంశంలో కాస్త చల్లబడ్డ అధికారులు.. ఇప్పుడు సిసోడియా ఆఫీస్ కు వెళ్లడంపై ఏం చేయనున్నారనే ఉత్కంఠ నెలకొంది.