లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఢిల్లీ కోర్టు 14 రోజుల జుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. ఆయన ఈ నెల 20 వరకు తీహార్ జైల్లో ఉండనున్నారు. సిసోడియా వారం రోజులుగా సిబిఐ కస్టడీలో ఉన్నారు. సోమవారం ఆయనను కోర్టులో హాజరు పరిచినప్పుడు ఆయన కస్టడీని పొడిగించాలని తాము కోరడం లేదని, కానీ ఆయన ప్రవర్తన నేపథ్యంలో భవిష్యత్తులో దీన్ని పొడిగించాలని కోరవచ్చునని సిబిఐ అధికారులు పేర్కొన్నారు.
నిందితుని నడవడిక సరిగా లేదన్నారు. వీరు సాక్షులను భయపెడుతున్నారని, ప్రొసీడింగ్స్ కి పొలిటికల్ కలర్ అద్దుతున్నారని అన్నారు. తాము అడిగిన అనేక ప్రశ్నలకు సిసోడియా సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారని సిబిఐ గతంలో కూడా ఆరోపించింది
. ఇక ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ కోర్టు ఈ నెల 10 న విచారణ జరపనుంది. దీనిపై సిబిఐ తన సమాధానాన్ని సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
సోమవారం కోర్టు ఉత్తర్వుల అనంతరం.. తన క్లయింట్ కళ్లద్దాలు, డైరీ, పెన్ను, భగవద్గీతను తీసుకువెళ్లేందుకు అనుమతించాలని సిసోడియా తరఫు లాయర్ అభ్యర్థించారు. ఇందుకు కోర్టు అనుమతించింది. అలాగే సిసోడియాకు అవసరమైన మందులను కూడా తీసుకువెళ్ళవచ్చునని పేర్కొంది. ఆయనను మెడిటేషన్ సెల్ లో ఉంచవచ్చునని జైలు సూపరింటెండెంట్ కు సూచించింది.
గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ లభించింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆయనకు సిబిఐ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2 లక్షల పూచీకత్తు, పాస్ పోర్టు సరెండర్ చేయాలని కోర్టు ఆదేశించింది.
.