ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సోమవారం సీబీఐ ప్రధాన కార్యాలయానికి పిలిపించిన తరువాత ఆయనను అరెస్ట్ చేస్తారని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ‘జోస్యం’ చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీజేపీ ఇలా కక్ష గట్టి వ్యవహరిస్తోందన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి గనుకే ఈ ‘విచారణ’ అంతా అని ఆయన ఆరోపించారు. ‘కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీబీఐ రేపు సిసోడియాను అరెస్టు చేస్తుంది.. ఈ సంస్థతో బాటు ఈడీ కూడా దేశంలో కనీసం 500 చోట్ల దాడులు, సోదాలు జరిపాయి. కానీ వాటికి ఏమీ లభించలేదు’అని ఆయన చెప్పారు.
ఎక్సయిజు పాలసీకి, దీనికి సంబంధం లేదన్న విషయం అందరికీ తెలుసునని, కానీ ఇది గుజరాత్ ఎన్నికలతో ముడిపడి ఉందని అన్నారు. బీజేపీ చర్యలకు ఎవరూ భయపడబోరన్నారు.
ఢిల్లీ ఎక్సయిజు స్కామ్ పై దర్యాప్తులో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకు తమ ప్రధాన కార్యాలయానికి రావాలని సీబీఐ.. సిసోడియాకు సమన్లు జారీ చేసింది.
తమ ఎఫ్ఐఆర్ లో ఆయనను ఒకటో నిందితునిగా పేర్కొంది. లిక్కర్ బిజినెస్ చేసేవారికి సిసోడియా రూ. 30 కోట్లు మాఫీ చేశారని, లైసెన్స్ ను తమ ఇష్ట ప్రకారం పొడిగించుకునేందుకు వీలుగా వారికి సౌకర్యం కల్పించారని ఆరోపించింది. ఎక్సయిజు నిబంధనలను అతిక్రమించి కొత్త పాలసీని రూపొందించారని పేర్కొంది.అయితే సీబీఐ అధికారులు తన ఇంట్లో 14 గంటలపాటు సోదాలు నిర్వహించినా వారికి ఏమీ లభించలేదని , అలాగే తన బ్యాంక్ లాకర్ లో కూడా వారికి ఏమీ దొరకలేదని సిసోడియా ట్వీట్ చేశారు. విచారణలో సీబీఐకి అన్నివిధాలుగా సహకరిస్తానన్నారు.