ఆచార్య సినిమా పరాజయం ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటివరకు కొరటాల శివపై జరిగిన ట్రోలింగ్ చూశాం. ఆ తర్వాత అతడిపై కురిసిన సానుభూతినీ చూశాం. మధ్యలో చిరంజీవిపై వచ్చిన విమర్శల్ని కూడా చూశాం. ఇప్పుడీ లిస్ట్ లోకి మణిశర్మ కూడా చేరాడు.
ఆచార్య సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చెత్త. రిలీజైన మొదటి రోజే మణిశర్మ ఇచ్చిన బీజీఎంను ఏకి పడేశారు ప్రేక్షకులు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు పెట్టింది పేరైన మణిశర్మ నుంచి ఇలాంటిది ఆశించలేదని తెగ పోస్టులు పడ్డాయి. తాజాగా వీటిపై స్పందించాడు మణిశర్మ.
నిజానికి ఆచార్య సినిమా కోసం తనదైన స్టైల్ లో ఓ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసి పెట్టాడట మణిశర్మ. ఆ వెర్షన్ ను కొరటాల శివ విన్నాడట. “మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది వద్దు, కొత్తగా ట్రై చేద్దాం” అని సలహా ఇచ్చాడట.కొరటాల సలహాతో మణిశర్మకు కూడా ఉత్సాహం వచ్చిందంట. కొత్తగా ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో ఇలా చెత్త బీజీఎం ఇచ్చాడు ఈ మ్యూజిక్ డైరక్టర్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు.
ఆచార్య సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదని అంతా తనను విమర్శిస్తున్నారని, కానీ అదే సినిమాలో 2 సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చానని, వాటి గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడడం లేదని బాధపడ్డాడు ఈ సీనియర్ సంగీత దర్శకుడు.