రాష్ట్రపతి ఎన్నికలు సోమవారం జరిగాయి. ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలోకి దిగారు. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని చెబుతున్నారు. ముర్ముకే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. అయితే.. ఎన్నికల సందర్భంగా వీల్ చైర్ లో వచ్చి అందరికీ షాకిచ్చారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఆయనకు ఏమైంది..? వీల్ చైర్ లో ఎందుకొచ్చారు..? ఇలే అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు నేతలు, ప్రజలు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు పార్లమెంట్ భవనానికి వచ్చారు మన్మోహన్. నలుగురు అధికారులు కష్టంగానే పైకిలేపి ఓటు వేయించారు. గతేడాది అక్టోబర్ 13న అస్వస్థతకు గురవడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు మన్మోహన్. చికిత్స అనంతరం అక్టోబర్ 31న డిశ్చార్జ్ అయ్యారు. ఆనాటి నుంచి రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా లేరు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ సమావేశాల నుంచి ఆయన సెలవు తీసుకున్నారు.
ఇప్పుడు ఒక్కసారిగా వీల్ చైర్ లో చూసేసరికి కాంగ్రెస్ శ్రేణులు ఆశ్చర్యపోయారు. చాలా బాధగా ఉంది.. మన్మోహన్ త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం మన్మోహన్ ఓటు వేసిన వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆయన వయసు 89 ఏళ్లు.
ఇటు ఆరోగ్యం సహకరించకున్నా.. బాధ్యతగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసినందుకు మన్మోహన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాంగ్రెస్ లో ఇలాంటి క్రమశిక్షణే ఉంటుందని అంటున్నారు.