ప్రధాని నరేంద్ర మోడీ.. తరచూ ప్రజలతో మాట్లాడేందుకు ‘మన్ కీ బాత్(మనసులోని మాట)’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఆయన మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా చాలా మందితో మాట్లాడారు. వారిలో రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా చాలా మంది పాల్గొన్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఆల్ ఇండియా రేడియోలో ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. అంతే కాదు, దూరదర్శన్ నెట్‌వర్క్‌లోని అన్ని ఛానల్స్‌తో పాటు మొబైల్ యాప్‌లోనూ ప్రసారమవుతుంది.
అయితే, మన్ కీ బాత్-88వ ఎడిషన్ కోసం ప్రజల తమ ఆలోచనలు పంచుకోవాలని ప్రధాని మోడీ ఆహ్వానించారు. ప్రజలు వారు ముఖ్యమైనవిగా భావిస్తున్నటువంటి అంశాలపై వారి అభిప్రాయాలను తన దృష్టికి తీసుకు రావాలంటూ విజ్ఞప్తి చేశారు. MYGOV, NAMO యాప్‌ల ద్వారా లేదా 1800-11-7800 నంబర్‌కు డయల్ చేసి మెసేజ్ రికార్డు చేసి థాట్స్ షేర్ చేసుకోవచ్చన్నారు. అట్టడుగు స్థాయి నుంచి మార్పు చేసే వారి అసాధారణ విజయాలను జరుపుకుంటున్నామని, అలాంటి స్ఫూర్తి దాయకమైన జీవన ప్రయాణాల గురించి తెలిస్తే వాటిని వచ్చే ఎపిసోడ్‌లో భాగస్వామ్యం చేయాలని ట్వీట్ చేశారు. కాగా, ‘మన్ కీ బాత్’ కార్యక్రమం 88వ భాగం ఏప్రిల్ 24న ప్రసారం కానుంది.
‘క్షేత్ర స్థాయిలో పరివర్తనకు కారకులు అయినటువంటి వ్యక్తుల అసాధారణమైన కార్యాలను మన్ కీ బాత్ ద్వారా మనం అభినందిస్తూ వస్తున్నాం. అలాంటి ప్రేరణాత్మక జీవన యాత్రలను గురించి మీకు తెలుసా? వాటిని ఈ నెల 24వ తేదీ నాటి కార్యక్రమం కోసం పంచుకోండి. వాటిని గురించి MYGOV, NAMO యాప్‌లకు రాయండి లేదా 1800-11-7800 కు డయల్ చేసి వాయిస్ మెసేజ్ రికార్డు చేయగలరు.’ అని మోడీ ట్వీట్ చేశారు.
Through #MannKiBaat we celebrate the extraordinary feats of grassroots level change-makers. Do you know of such inspiring life journeys? Share them for this month’s programme on the 24th. Write on MyGov, NaMo App or dial 1800-11-7800 to record a message. https://t.co/z0uOm3WcTL
— Narendra Modi (@narendramodi) April 8, 2022