తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రానున్న ఎన్నికల కోసం వివిధ పార్టీలు..పార్టీల్లోని కీలక నేతలు ఇప్పటి నుంచే స్కెచ్ వేయడం మొదలుపెట్టారు. అయితే బీఆర్ఎస్ తో పాటు బీజేపీ ఇంకా కాంగ్రెస్ కూడా పోటీలో నిలుస్తుండడంతో.. ఏ పార్టీలోకి వెళితే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందన్న అంచనాలతో కొందరు కొత్త రాజకీయనాయకులు అరంగేట్రం చేయడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.
ఈక్రమంలోనే ప్రముఖ కంపెనీ ఎంఎస్ఎన్ ఫార్మా పరిశ్రమల అధినేత తనయుడు కంపెనీ డైరెక్టర్ మన్నే జీవన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు. సంక్రాంత్రి పండుగ తరువాత పాలమూరులో ఆయన రాజకీయంగా అడుగు వేయనున్నారు. కాంగ్రెస్ లేక బీజేపీ ఏ పార్టీ అయినా రాజకీయ ప్రవేశానికి సరే అనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్టు సమాచారం. అయితే త్వరలోనే ఆయన ఏ పార్టీ నుంచి అనేది ఖాయం కానుంది.
ఇక జీవన్ రెడ్డి చిన్నాన మన్నే శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి మహబూబ్ నగర్ ఎంపీ గా కొనసాగుతున్నారు. ఏ పార్టీ నుంచి అయినా సరే మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి చిన్నాన, అసెంబ్లీ నుంచి జీవన్ రెడ్డి లు ఒకే పార్టి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగుతుంది.
ఒకే పార్టి నుంచి అవకాశం ఇస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియెూజకవర్గాల అభ్యర్థుల గెలుపుకు కావల్సిన బాధ్యత తన భుజాలపై వేసుకుంటానని ఆయా పార్టీల అధినేతలకు మన్నే జీవన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది.
ఇక డిసెంబర్లో ఓ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ హైదరాబాద్ లో రహస్యంగా సమావేశమై.. వచ్చే ఎన్నికలలో తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి కావాలని ఉమ్మడి నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దీంతో పాటు మన్నే జీవన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశంతో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆ సామాజిక వర్గం భావిస్తోంది.
మరో వైపు కొల్లాపూర్ రాజకీయాల విషయానికొస్తే.. రానున్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది అంచనా వేసిన తరువాతే ఆ పార్టీలోకి చేరాలని జూపల్లి కృష్ణారావు భావిస్తున్నట్టు సమాచారం. లేని పక్షంలో తాను ఇండిపెండెంట్ గానైనా బరిలో నిలబడి గెలుస్తానన్న ధీమాతో ఉన్నట్టు తెలుస్తోంది.