పెద్దపల్లి జిల్లా మంథని జంట హత్యల కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనేక అనుమానాలకు తావిస్తోంది. మర్డర్ జరిగినప్పటీ నుంచి.. వారు ఎవరినో కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హత్య చేసిన తర్వాత కుంట శ్రీనివాస్‌తో పాటు మరో వ్యక్తి కమాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారని తెలుస్తోంది. అయితే ఆ సమాచారాన్ని కావాలనే పోలీసులు బయటపెట్టలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. హత్యలపై బయట జరిగే ప్రచారాన్ని బట్టి.. కేసు దర్యాప్తును చేయాలని.. ఒక దశలో కుంట శ్రీనివాస్‌ను కాపాడేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు వస్తున్నాయి. హత్య జరిగిన తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు.
ముఖ్యంగా సీన్ ఆఫ్ ఎవిడెన్స్‌ను కాపాడటంలో పోలీసులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సంఘటనా స్థలాన్ని వెంటనే సీజ్ చేయకుండా ఉండిపోయారు. ఆధారాలు చెదిరిపోకుండా చూడటంలో ఘోరంగా విఫలం చెందారు. కనీసం క్లూస్ టీం వచ్చే వరకు ఆ స్థలంలోకి ఎవరూ రాకుండా, ఆధారాలు చెరిపేయకుండా చూడాలి. కానీ ఆ విషయాన్ని వారు అసలే పట్టించుకోలేదు. ఏదో నామమాత్రంగా చిన్న ముళ్లకంపల్ని తీసుకొచ్చి అడ్డంగా పెట్టారు. అలాగే మృతుడు వామనరావు సెల్ ఫోన్, కడియం, కళ్లద్దాలు, ఇతర వస్తువులన్నీ అక్కడే చెల్లాచెదురుగా ఉన్నా పట్టించుకోలేదు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా ఈ హత్యోదంతం సంచలనం సృష్టించినా.. కనీసం ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు రాలేదు. అందరూ లాయర్ దంపతులను తరలించిన పెద్దపల్లి ఆస్పత్రికి వెళ్లి విచారించారు. ఇవన్నీ చూస్తోంటే.. కావాలనే ఆధారాలు లేకుండా చేసేందుకు పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేశారా అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి.