మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టుల వల్ల యేటా 700 ఎకరాల్లో పంట ముంపునకు గురవుతోందని ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆ రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టుల వల్ల ముంపు గ్రామాల రైతులు భూపాలపల్లి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ…. గత మూడేండ్లుగా 700 ఎకరాల్లో రైతులు పంట పండించుకోలేక పోతున్నారన్నారు.
ప్రాజెక్టులోకి నీరు రాగానే పంట అంతా నీటి పాలు అవుతోందన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఎన్ని సార్లు తీసుకు వెళ్లినా పట్టించుకోవడంలేదన్నారు. రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకునే కేసీఆర్ ఈ ప్రాంత రైతుల పట్ల మాత్రం వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ప్రాంత రైతాంగ సమస్యలపై శాసన సభలో పలు మార్లు అడిగినప్పటికీ హామీలు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. కానీ వాటిని అమలు మాత్రం చేయడం లేదని విమర్శించారు. ఇక్కడి నుంచి వచ్చే ఆదాయంతో సీఎం కేసీఆర్, ఇతర మంత్రులు తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
కానీ ఇక్కడి రైతుల కష్టాలను మాత్రం వారు అర్థం చేసుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు. రాబోయే నెల రోజుల్లోగా రైతులకు నష్ట పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్కార్ ఓడిపోవడం ఖాయమన్నారు.