భారత్ లో పండే తేయాకుకు ప్రపంచ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే చాలా దేశాలు ఏరి కోరి భారత్ నుంచి తేయాకును దిగుమతి చేసుకుంటాయి. కానీ ఇటీవల భారత్ నుంచి వస్తున్న టీ ఎగుమతులను పలు దేశాలు వెనక్కి పంపిస్తున్నాయి.
ఇండియన్ టీ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ చైర్మన్ అన్షుమాన్ కనోరియా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్ నుంచి వచ్చే టీ ఆకుల్లో పరిమితికి మించి పురుగుల మందు ఉంటుందోని ఆయన తెలిపారు. ఈ క్రమంలో చాలా దేశాలు భారత టీ ఉత్పత్తులను తిరిగి పంపుతున్నాయని చెప్పారు.
మరోవైపు స్వదేశీ వ్యాపారులు సైతం వీటిని తీసుకోవడం లేదని వివరించారు. చాలా వరకు దేశాలన్నీ ఈయూ (యూరోపియన్ యూనియన్) ప్రమాణాలనే ఈ ఎగుమతుల విషయంలో పాటిస్తాయని, ఇవి భారత్ లోని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిబంధనలతో పోలిస్తే చాలా కఠినంగా ఉంటాయన్నారు.
దేశీయ వర్తకుల్లో చాలా మంది చట్టాలకు లోబడి ఎగుమతులు చేయకుండా కేవలం ఎఫ్ఎస్ఎస్ఏఐల నిబంధనలను మరింత సరళతరం చేయాలని కోరుతున్నారని ఆయన వివరించారు. టీ అనేది హెల్త్ డ్రింక్ అయినందువల్ల ఇలాంటి పరిణామాలు తప్పుడు సంకేతాలను పంపిస్తాయని వివరించారు.