కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్ర ఆర్టీసీ బస్సు, పాల ల్యాంకర్, టెంపో ట్రావెలర్ వాహనం మూడు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టెంపో వాహనంలోని మొత్తం 9 మంది ప్రయాణికులు మరణించారు.
ఆర్టీసీ బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో హసన్ జిల్లా బాణావర పోలీస్ స్టేషన్ పరిధిలోని చెలువనహళ్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు, పాల ట్యాంకర్ మధ్య టెంప్ ట్రావెలర్ నలిగిపోవడడంతో.. ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని పోలీసులు వెల్లడించారు.
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. శివమొగ్గ వైపు వెళ్తున్న బస్సు.. ముందున్న టెంపో వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో టెంపో వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. అదే సమయంలో ఎదురుగా పాల ట్యాంకర్ వచ్చింది. వేగంగా వెళ్లి.. ట్యాంకర్‌ని ఢీకొనడంతో.. టెంపో ట్రావెలర్ నుజ్జునుజ్జయింది. ఆర్టీసీ బస్సు, పాల ట్యాంకర్ మధ్య చిక్కుకొని.. చితికిపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే టెంపో వాహనంలోని 9 మంది ప్రయాణికులు మరణించారు. మృతుల్లో నలుగురు పిల్లలు ఉన్నారని హసన జిల్లా ఎస్పీ హరిరామ్ శంకర్ తెలిపారు. ఆర్టీసీ బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 10 మంది గాయపడ్డారని చెప్పారు.
వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం చెలువనహళ్లి సమీపంలో హైవేను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు.. రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. చాలా రోజుల నుంచి అక్కడ పనులు కొనసాగుతున్నాయి. అయితే రహదారిలో డైవర్షన్‌పై గందరగోళం ఉందని.. రాత్రి జరిగిన ప్రమాదానికి ఇదే కారణమయి ఉండవచ్చని పోలీస్ అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.