కర్ణాటకలోని బెళగావి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెట్టుకు వాహనం బలంగా ఢీకొట్టి బోల్తా పడిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
హనుమవ్వ(25), దీప(31), సవిత(17), సుప్రీత(11), మారుతి(42), ఇందిరవ్వ(24) మృతి చెందారు.హులకుంట గ్రామం నుంచి సవదత్తి ఎల్లమ్మ ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పికప్ బొలెరో వాహనంలో 23 మంది ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు.
ఎస్పీ డా.సంజీవ్ పాటిల్ ఆ స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. గాయపడిన వారందరినీ సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.మృతులు కాలినడకన ఎల్లమ్మ ఆలయానికి బయలుదేరారు.
ఆ సమయంలో బొలెరో వాహనం డ్రైవర్ యాత్రికులను ఆపి మరీ వారిని గుడివద్ద దింపుతానని చెప్పి వాహనం ఎక్కించాడు. వాహనం ఎక్కిన నిమిషాల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.