– బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో అనేక అనుమానాలు
– టాపిక్ డైవర్షన్ కోసమే ఇదంతా చేశారా?
– లేక.. సీఐ పోస్ట్ కోసమే ఈ డ్రామాలా?
– పట్టుకున్నారు సరే.. రక్త నమూనాలెందుకు తీసుకోలేదు!
– ఇంతకీ.. టాస్క్ ఫోర్స్ పోలీసులు సాధించిందేంటి?
– పోస్ట్ కాపాడుకునేందుకు కీలుబొమ్మల్లా పోలీస్ బాస్ లు!
క్రైం బ్యూరో, తొలివెలుగు:బంజారాహిల్స్ డ్రగ్స్ వ్యవహారంతో మత్తు పడగ కింద నగరం నిద్ర పోతోందని తేలిపోయింది. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే డ్రగ్స్ పార్టీ జరగడం.. పైస్థాయి అధికారులకు తెలియకుండా ఉంటుందా? అంటే పోలీస్ శాఖలో మౌనమే సమాధానంగా వస్తోంది. విచారణ జరుగుతోంది.. అన్నీ బయటకొస్తాయి.. అంటూ ఎప్పుడూ చెప్పే డైలాగ్సే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. నిజానికి కొన్నేళ్ల క్రితం కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తెలంగాణలో డ్రగ్స్ కు బానిసలు అవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని చెప్పింది. అదే సమయంలో కేంద్ర సోషల్ జస్టిస్ మంత్రిత్వశాఖ చేసిన సర్వేలో ఎన్నో భయంకర విషయాలు బయటకొచ్చాయి. 20 శాతం మంది మత్తులో నిత్యం మునిగి తేలుతున్నారని తేలింది.
కేంద్రం హెచ్చరికలతోగానీ కేసీఆర్ కళ్లు తెరవలేదు. వెంటనే వెయ్యి మందితో ఓ వింగ్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటన అయితే ఇచ్చారు. కానీ.. ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. గతేడాది అక్టోబర్ లోనూ ఓ ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేసి ఇదే విషయాన్ని ఊదరగొట్టి వదిలేశారు. హైదరాబాద్ కి ప్రత్యేకంగా నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. కార్యరూపం దాల్చలేదు. కొంతమంది అధికారులు పనిచేస్తున్నా.. అది పేరుకు మాత్రమే. ఫలితంగా మత్తుకు బానిసలు అవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.
రాష్ట్రంలో గంజాయికి 2 లక్షల మంది వరకు అలవాటు పడ్డారు. ఓపీఎంకు సంబంధించి 6 లక్షల మంది, మెడికల్ షాపు మెడిసిన్ ద్వారా 4 లక్షల మంది మత్తుకు బానిస అయ్యారు. వీటికి తోడు లోకల్ డ్రగ్స్ కు ఇంకో 2 లక్షల మంది చిత్తు అవుతున్నారు. ఇక కొకైన్ కి 22 వేల మంది.. యాంఫెటమిన్ కి మరో 2 లక్షల మంది అలవాటు పడ్డారు. గంజాయితో పాటు లోకల్ గా ఉండే సరుకును వివిధ రూపాల్లో ఆయిల్ గా, పొడిగా తయారు చేసి అలవాటు చేసుకున్నవారు 1.80 లక్షల మంది ఉన్నట్లు కేంద్రం తేల్చింది. ఈ లెక్కలన్నీ 2019 టైమ్ లో చెప్పినవి. రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంతో ఇప్పుడా సంఖ్య మరింత పెరిగి ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే.. కేసీఆర్ సర్కార్ డ్రగ్స్ కేసులను ఏదైనా ఇష్యూను డైవర్ట్ చేసేందుకు మాత్రమే వాడుకుంటోందని విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయంలో అదే జరిగిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ కేసులో ఏకంగా అకున్ సబర్వాల్ పై ఒత్తిడి తెచ్చి పూర్తిగా నీరుగార్చారనే విమర్శలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ ప్రతిష్టకు ఇబ్బంది అవుతుందన్న ప్రతీసారి ఇలా డ్రగ్స్ కేసుని భూతద్దంలో చూపించి… అసలైన టాపిక్ ని డైవర్ట్ చేస్తోందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.
బంజారాహిల్స్ పబ్ కేసులో పోలీసులు సాధించింది ఏంటి?
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్.. పబ్స్ ద్వారా పెరుగుతుందని భావించి ఐదేళ్ల క్రితమే కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది టీఆర్ఎస్ సర్కార్. పలు ఫైవ్ స్టార్ హోటల్స్ లో 24 గంటలపాటు మద్యం అమ్ముకోవచ్చు.. పబ్స్ నడుపుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది. దీనికోసం కోట్లలో ఫీజులు చెల్లించుకుని అనుమతులు ఇచ్చింది. అందులో భాగంగానే ర్యాడిసన్ బ్లూలో పుడింగ్ పబ్ కు పర్మిషన్ వచ్చింది. ఎప్పటినుంచో ఇక్కడ పార్టీలు జరగడం కామన్. వీవీఐపీల పుత్రరత్నాలు వస్తూ ఉంటారు. సెలబ్రెటీలు ఇక్కడ పార్టీలు చేసుకుంటారు. అయితే ఇక్కడ జరిగే తతంగాన్ని ప్రస్తుతం పెద్దగా చూపించి.. పోస్టింగ్ కొట్టేసేందుకే టాస్క్ ఫోర్స్ బాస్ తో చేతులు కలిపి హడావుడి చేశారనే ప్రచారం జరుగుతోంది. అందరూ డ్రగ్స్ వాడారని 150 మందిని తీసుకొచ్చిన పోలీసులు కేవలం కొందర్ని మాత్రమే అరెస్ట్ చేసినట్లు చూపించారు. మిగితా వారికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే వదిలేశారు. అంత మందిలో కొందరైనా డ్రగ్స్ తీసుకుని ఉంటారుగా.. వారి నుంచి రక్త నమూనాలు సేకరిస్తే అన్నీ తేలిపోయి ఉండేవిగా అనే చర్చ జరుగుతోంది. కానీ.. రైడ్ చేసినప్పుడే 30 మందిని తప్పించారనే ఆరోపణలున్నాయి. ఆ తర్వాత సీఐని బదిలీ చేయించి.. ఎలాంటి పరీక్షలు నిర్వహించకపోవడం వెనుక రహస్య ఎజెండా అంతా సీఐ సీట్ కోసమే తప్ప వేరే ఉద్దేశం లేదని డిపార్ట్ మెంట్ లో గుసగుసలాడుకుంటున్నారు. రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా.. పోస్టింగ్ రాకపోవడంతో టాస్క్ ఫోర్స్ బాస్ తో కలిసి పక్కా స్కెచ్ తో.. కొంత మంది మీడియా ప్రతినిధులతో పావులు కదిపి.. ఈ తతంగాన్ని పూర్తి చేశారని వార్తలు వస్తున్నాయి.
టాస్క్ ఫోర్స్ ప్లాన్స్ అమలు.. చెప్పిన అబద్దాలు..!
1. 24 గంటలపాటు అనుమతుల అనుమతి ఉన్నా.. టైమ్ దాటి నడుపుతున్నారని 150 మందిని తీసుకొచ్చామని చెప్పారు.
2. అందరినీ తీసుకొచ్చామని చెబుతున్న టాస్క్ ఫోర్స్.. కొందర్ని తప్పించింది. డ్రగ్స్ వాడింది ఏవరో గుర్తించారా? మాఫియా ప్రాణాలు తీస్తున్నా డ్రగ్స్ తీసుకున్నవారిని గుర్తించరా..? 12 గంటల వరకు స్టేషన్ లో ఉంచుకున్నారు. వారి నుంచి రెండు నిమిషాలు వెంట్రుకలు, గోర్లు, రక్తనమూనాలు స్వీకరించాలని తెలియదా?
3. పెద్ద పెద్ద హోటల్స్, పబ్స్ లో ఓటీపీ వ్యవహారం కామన్. అది డ్రగ్స్ కోసమేనని ఎలా ఫిక్స్ అవుతారు. నగరంలో చాలా బార్ అండ్ రెస్టారెంట్స్ లో అల్లర్లు, గొడవలు లేకుండా.. ఒకరి పూచీకత్తుపై మరొకరు పార్టీలో జాయిన్ అయ్యేలా ఓటీపీ సిస్టమ్ పెట్టుకున్నారు. ఇది కూడా తెలియని వాళ్లు డ్రగ్స్ మాఫియాపై దాడులు చేసి క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు.
4. ఎదైనా దాడులు చేస్తే.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. వందమంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు. కానీ.. ఒక్క అమాయకుడికి శిక్ష పడకూడదని పోలీస్ శిక్షణలో చెప్పలేదా..? ఎన్ని ఆటంకాలు ఉన్నా.. టార్గెట్ ని మాత్రమే కొట్టాలనే ఉద్దేశం లేకుండా గొర్రెల మందలో పడ్డ తోడేళ్లలాగా పోలీసులు వ్యవహరించడం ఏంటనే అనుమానాలు తావిస్తున్నాయి.
5. రాజకీయ నాయకుల వారసులు, సెలబ్రెటీలు, హై ప్రొఫైల్ కస్టమర్లు వస్తున్న సమయంలో డ్రగ్స్ ప్లెడర్స్ మాటు వేస్తారు. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో మూలాలను కాకుండా.. కేవలం మేనేజ్ మెంట్ నే టార్గెట్ చేసుకున్నారు. అయితే ఈ మేనేజ్ మెంట్ వ్యవహారంపై గతంలో సీఐకి చెప్పినా.. ఉన్నతాధికారులు లైట్ తీసుకోమని చెప్పడం వెనుక ఉన్న అర్థం ఏంటి..?
6. పబ్ కల్చర్ ని డ్రగ్స్ పేరుతో ఇబ్బందులు పెట్టవద్దని నెలకు ఎన్ని లక్షల రూపాయలు ఎంత మంది అధికారులకు చేరుతున్నాయో టాస్క్ ఫోర్స్ కు బయట పెట్టే దమ్ము ఉందా..? అసలు డ్రగ్స్ దందా జరిగితే ఎక్సైజ్ శాఖ, కొత్తగా ఏర్పాటు చేశామని చెబుతున్న నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులను సస్పెండ్ చేయాలి కానీ.. లా అండ్ ఆర్డర్ ని కఠినంగా పాటిస్తున్న ఓ సీఐని బలి చేయడం దేనికి నిదర్శనం? ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని పంపించిన వారి లిస్ట్ ని మీడియాకి ఎవరిచ్చారు?
7. మూడు బర్త్ డే పార్టీల్లో దొరికింది 5 గ్రాములకు తక్కువగా ఉన్న కొకైన్ మాత్రమే. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ నుంచి బంజారాహిల్స్ సీఐగా వచ్చిన అధికారి వారికి శిక్ష పడేలా సాక్షాధారాలు సేకరిస్తారా..? మూలాలను వెలికి తీసి ఆనవాళ్లు లేకుండా చేస్తారా?
అప్పుడు పవర్ ఫుల్.. ఇప్పుడు పవర్ నిలుపుకోవడమే సవాల్
జంట కమిషనరేట్లలో కొత్త సీపీలు తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే.. నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మీడియా మేనేజ్ మెంట్ నుంచి మొదలుకొని పార్టీలోని అందరి ఎమ్మెల్యేల మనుసులు గెలుచుకునేలా వ్యవహరించాల్సి ఉంటోంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రతో ఓ సీపీ తన పనితీరుతో సోషల్ మీడియాలో పరువు పోగొట్టుకున్నారు. సాక్షాధారాలు సేకరించలేక.. నిందుతులందరికీ బెయిల్ రావడంతో పోలీసింగ్ అంటే పవర్ కాదు.. ఫ్లవర్ అన్నట్లుగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఇక అధికారపార్టీ మీడియాతో మంచిగా ఉండాలనే ఉద్దేశం శృతి మించుతోంది. సైబరాబాద్ లో మొదట్లో వార్తలు వచ్చినా.. ఆ తర్వాత డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకునే పనిలో పడ్డారు. కానీ ఇంకా ఆ వలలో నుంచి పోలీస్ కమిషనర్స్ బయటపడటం లేదు. ఇప్పుడు హైదరాబాద్ కమిషనరేట్ లో ఇలాంటి సన్నివేశాలే కనిపిస్తుండటం కలవర పెడుతోంది. సీఐ పోస్ట్ ఊస్ట్ చేయడానికి, అనుకున్న అధికారిని తెచ్చుకునేందుకు వేసిన ప్లాన్ లో మీడియా మిత్రులు కూడా సక్సెస్ అయ్యారని చెప్పుకుంటున్నారు. పవర్ ఫుల్ అధికారులు సీనియార్టీ పెరుగుతున్న కొద్దీ పార్టీలకు వారి మీడియా ప్రతినిధులకు ఇంతలా ఒదిగిపోవడం పోలీస్ శాఖకే ప్రమాద ఘంటికలని హెచ్చరిస్తున్నారు సీనియర్ పోలీస్ అధికారులు.