ఈ మధ్య కాలంలో తెలంగాణలో మావోయిస్ట్ కలకలం తరుచూ వినిపిస్తోంది. తాజాగా ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో మందుగుండు సామగ్రి బయటపడింది. వాటిని మావోయిస్టులు అమర్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దొడ్ల గ్రామం సమీపంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు… జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, క్లైమర్ మైన్స్ తో పాటు మరికొన్ని మందుగుండు సామగ్రిని గుర్తించారు.
పక్కా సమాచారం అందుకున్న ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు.. డిటోనేటర్, మూడు క్లైమర్ మైన్స్, 5 కప్లింగ్స్, 33 ఎస్ఎల్ఆర్ రౌండ్స్, 100 మీటర్ల వైరు, 1 బ్యాటరీ, రెండు కేజీలు మేకులను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులను హతమార్చాలనే కుట్రతోనే మావోయిస్టులు వీటిని అమర్చారని ఎస్పీ సంగ్రాంసింగ్ తెలిపారు. మావోయిస్టులు చేసే ఇలాంటి చర్యలతో ఇప్పటికే ఎంతో మంది అమాయకులు, మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయని ఆయన వెల్లడించారు. ఇలాంటి దురాగతాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు ఎస్పీ.
2019 మార్చి నెలలో ఇలాగే మావోయిస్టులు అమర్చిన మందుగుండుకు పెంటయ్య అనే వ్యక్తి బలయ్యాడని గుర్తు చేశారు. ఆయా ప్రాంతాల్లో తిరిగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ల్యాండ్ మైన్స్ బారిన పడకుండా జాగ్రత్త పడాలన్నారు. అనుమాన వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.