ములుగు జిల్లా వాజేడు మండలంలోని జగన్నాధపురం క్రాస్ రోడ్డు వద్ద ప్రభుత్వ నిషేదిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ కొరియర్ ను వాజేడు పోలీసులు పెట్రో లింగ్ చేస్తున్న క్రమంలో అరెస్టు చేశారు. సోమవారం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలకేంద్రంలో ఏటూరు నాగారం ఏఎస్పీ అశోక్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాడ్వాయి మండలకేంద్రానికి చెందిన దబ్బకట్ల సుమన్ తండ్రి సమ్మయ్య విచారణలో 2010వ సంవత్సరంలో ప్రభుత్వ నిషేదిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ విప్లవ భావాలకు ప్రేరేపించబడి పార్టీలో సానుభూతి పరులుగా చేరి వారికి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
తర్వాత కొరియర్ గా మారి పార్టీ ఫండ్ కొరకు తెలంగాణలో జరిగే వివిధ పనుల కాంట్రాక్టర్ల వివరాలు సేకరించి వారి వద్ద నుండి పార్టీ ఫండ్ వసూలు చేసి పార్టీకి అందజేస్తుండే వాడని తెలిపారు. ఇదే క్రమంలో వాజేడు, ఏటూరు నాగారం, తాడ్వాయికి చెందిన వివిద పార్టీల నాయకులైన బోదెబోయిన బుచ్చయ్య, పెనుమాళ్ళ రామకృష్ణా రెడ్డి, కావిరి అర్జున్, లచ్చు పటేల్, బొల్లు దేవేందర్, ఇర్సవడ్ల వెంకన్న, దుర్గం రమణయ్య, ఇంద్రారెడ్డి వద్ద నుండి పార్టీ ఫండ్ వసూలు చేయలనే ఉద్దేశంతో ఈ నెల 1న నిషేదిత సిపిఐ(మావోయిస్ట్)పార్టీ అగ్ర నాయకుల ఆదేశాలమేరకు వీరిపేర్లతో లేఖను తన స్వహస్తలతో రాసి మీడియా ద్వారా పంపించడం జరిగింది.
వివిధ కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల వద్ద నుండి వసూలుచేసిన రూ. లక్ష రూపాయలు తీసుకొని మావోయిస్ట్ పార్టీ అగ్ర నాయకులను కలవడానికి వెళ్తుడంగా జగన్నాధపురం క్రాస్ రోడ్డు సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను చూసి భయంతో పారిపోవటానికి యత్నించాడని తెలిపారు. ఇతని వద్ద నుండి లక్ష రూపాయల నగదు, మావోయిస్ట్ పార్టీకి చెందిన విప్లవ సాహిత్యం, సెల్ ఫోన్ లభించినట్లు పేర్కొన్నారు.
అతను అంగీకరించిన నేరం ప్రకారం అతనిని అరెస్ట్ చేసి కోర్టు వారి ఎదుట హాజరు పరిచి రిమాండ్ కు పంపనున్నట్లు తెలిపారు. ఎవరూ కూడా మావోయిస్టు పార్టీకి సహకరించవద్దని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని పోలీసులు కోరుతున్నారు.
ఏజెన్సీ గ్రామాలలో అమాయక గిరిజనులను బలవంతంగా నేరాలకు పాల్పడే విధంగా ప్రోద్బలిస్తూ వారి జీవితాలను నక్సల్స్ నాశనం చేస్తున్నారని, నక్సల్స్ ఎప్పుడూ ఆదివాసీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేశారని, వారి స్వంత ప్రయోజనాలను నెరవేర్చు కోడానికి ఉపయోగించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సిఐ శివప్రసాద్, వాజేడు ఎస్సై తిరుపతిరావు తదితరులు ఉన్నారు.