మావోయిస్టు నేత శారదక్క తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయింది. ఈమె స్వస్థలం మహబూబాద్ జిల్లా గంగారం. పీపుల్స్ వార్ పార్టీకి ఆకర్షితురాలై 1994లో అజ్ఞాతంలోకి వెళ్లింది. ప్రస్తుతం జిల్లా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తోంది. గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసింది.
శారదక్క భర్త, మావోయిస్టు నేత హరిభూషణ్.. ఈ ఏడాది జూన్ లో కరోనాతో చనిపోయాడు. ఆరోగ్యం సహకరించకపోవడం, భర్త దూరం కావడంతో… అడవిలో తాను ఉండలేనని భావించి ఆమె లొంగిపోయినట్లుగా డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆరోగ్య కారణాలతో చాలామంది అడవిని వదిలి బయటకు వస్తున్నారని చెప్పారు.
2008లో వరంగల్ ఎస్పీ ముందు శారదక్క లొంగిపోయిందని గుర్తు చేశారు డీజీపీ. అయితే 2011లో తిరిగి పార్టీలో చేరిందని.. 2016లో చర్ల ఏరియా కమిటీకి ప్రమోట్ అయిందని.. ఆమెపై 25 కేసులున్నాయని వివరించారు. ఆరుసార్లు ఎదురుకాల్పుల్లో తప్పించుకుందని చెప్పారు మహేందర్ రెడ్డి.