మావోయిస్ట్ అగ్రనేత రామన్న భార్య సావిత్రి పోలీసులకు లొంగిపోయింది. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా పని చేసిన రామన్న భార్యే సావిత్రి. 1994లో ఈమె దళం సభ్యురాలుగా చేరింది. అయితే గతేడాది తన కుమారుడు రంజిత్ సైతం పోలీసులకు లొంగిపోయాడు. ఇప్పుడు సావిత్రి లొంగుపాటుతో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.
సావిత్రి మావోయిస్ట్ దండకారణ్య కమిటీ సెక్రటరీ, డేంజరస్ రామన్న భార్య. 1994లో దళం సభ్యురాలైన సావిత్రిని రామన్న వివాహం చేసుకున్నాడు. రామన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్రాష్ట్రాల్లో మోస్ట్‌వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ఇతనిపై గతంలో పోలీసులు రూ.40లక్షల రివార్డును ప్రకటించారు. కానీ 2019లో గుండెపోటుతో ఛత్తీస్‌గఢ్ అడవుల్లో రామన్న ప్రాణాలను విడిచాడు.
కాగా 30 ఏళ్లుగా దళంలో కీలక పాత్ర పోషించింది సావిత్రి. పోలీసులపై జరిపిన 9 దాడుల్లో చురుగ్గా వ్యవహరించారని డీజీపీ వివరించారు. దండకారణ్యంలో మూడు ఆర్గనైజేషన్స్ లో ఇంచార్జ్ గా కూడా వ్యవహరించింది. సావిత్రి మొత్తం ఛత్తీస్ గఢ్ లోని దళంలోనే పని చేశారని డీజీపీ పేర్కొన్నారు. అలాగే సావిత్రిపై ఛత్తీస్ గఢ్ లో రూ.10 లక్షల రివార్డ్ కూడా ఉందని డీజీపీ తెలిపారు.
1992లో లింగన్ పల్లిలో సావిత్రి పాల్గొన్న ఆపరేషన్ లో 15 మంది పోలీసులు చనిపోయారని, అలాగే 2000లో ల్యాండ్ మైన్ బ్లాస్ట్ ద్వారా 5గురు మృతి చెందారని డీజీపీ వెల్లడించారు. అంతేకాకుండా 2007లో కొత్త చెరువు ల్యాండ్ మైన్ బ్లాస్ట్ లో 15 మంది, 2017లో 24 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు, 2017లో కొత్త చెరువులో జరిగిన కాల్పుల్లో 12 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు మరణించినట్టు డీజీపీ వివరించారు.