భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శనివారం మావోయిస్టుల బ్యానర్లు, కరపత్రాలు కలకలం రేపాయి. మార్చి 23ను భగత్ సింగ్, సుఖదేవ్ రాజ్ గురుల అమరత్వ దినోత్సవంగా పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.
ప్రజావ్యతిరేక హిందూ ఫాసిస్టు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పోరాటాలు సాగించాలని మావోయిస్టులు కరపత్రాల్లో వెల్లడించారు. కుదునురు, ఆర్ కొత్తగూడెం ప్రధాన రహదారి.. దానవాయిపేట, చింతగుప్పా, వెంకటాపురం రహదారిలో మావోయిస్టులు ఈ బ్యానర్లు, కరపత్రాలను అతికించారు.
కాగా ఈ బ్యానర్లు, పోస్టర్లు తెలంగాణ కమిటీ భారత మావోయిస్టు పార్టీ పేరుతో వెలిశాయి. దీంతో సమాచారం అందుకున్న ఇంటెలిజెన్స్ విభాగం.. పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా గస్తీ నిర్వహిస్తున్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి భద్రాద్రి కొత్తగూడెంలో జల్లెడ పడుతున్నారు. అనుమానంగా ఉన్న వ్యక్తులపై నిఘా పెంచారు పోలీసులు.