జార్ఖండ్ లో మావోయిస్టుల కలకలం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. రాష్ట్రంలో వరుసగా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు మావోయిస్ట్ లు. తాజాగా గిరిడి జిల్లా డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వంతెనను పేల్చేశారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. అంతేకాకుండా.. జిల్లాలోని ఒక మొబైల్ ఫోన్ టవర్ ను కూడా పేల్చేశారు. మరో టవర్ కు నిప్పంటించి తగలబెట్టారు.
అయితే.. ఇటీవల మావోయిస్ట్ నేత ప్రశాంత్ బోస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని బేశరతుగా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇలాంటి దురాఘతాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్ బోస్ అరెస్టుకు నిరసనగా మావోయిస్టులు ప్రస్తుతం ‘రెసిస్టెన్స్ వీక్’ పాటిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే విధ్వంసాలకు తెగబడుతున్నారు.. మొదట ఖుఖ్రా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఎయిర్ టెల్ సెల్ టవర్ కు నిప్పుపెట్టారు దుండగులు. ఆ తర్వాత.. జైనుల యాత్రాస్థలం మధుబన్ లోని ఐడియా టవర్ ను పేల్చేశారని అధికారులు వివరించారు.
మావోయిస్టుల చర్యల నేపథ్యంలో వారి కోసం ఆపరేషన్ ను మరింత ముమ్మరం చేసినట్లు అధికారులు వివరించారు. మరోవైపు ఏజెన్సీలోని గ్రామాలను సైతం అప్రమత్తం చేశామని వెల్లడించారు. తమ పంతాలకు పోయి.. అమాయకపు ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడటం కరెక్ట్ కాదని మండిపడ్డారు అధికారులు.