ఛత్తీస్ గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. కొంత కాలంగా రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు పరిమితం అయ్యాయి. తాజాగా దంతేవాడ జిల్లా బచేలి-భాన్సీ మార్గం మధ్యలో విశాఖపట్నం వైపు ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలును అడ్డగించిన మావోయిస్టులు.. రైల్ఇంజన్ కు నిప్పు పెట్టి తగలబెట్టారు.
సుమారు 20 మంది సాయుధ నక్సలైట్లు రైలును నిలిపివేశారని.. ఇంజన్ కు నిప్పంటించారని బాధితులు తెలిపారు. దీంతో కిరండూల్ నుంచి విశాఖపట్నం మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు వెల్లడించారు.
రైలింజన్ లోపలి భాగం పూర్తిగా కాలిపోవడంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.
చాలా కాలం తర్వాత మరోసారి నక్సలైట్లు తమ ఉనికిని ప్రదర్శిస్తున్నారు. దీంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.