దున్నేవాడికి భూమి ఇవ్వాలంటూ మావోయిస్టులు ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నారు. పేదల భూములు కబ్జాకు గురైన.. అన్యాయక్రాంతం అయిన వారు రంగంలోకి దిగుతారు. ఇప్పడూ మరోసారి తెలంగాణలో పేదల భూములు అన్యాయక్రాంతం అవుతున్నాయంటూ హెచ్చరికలు జారీ చేశారు మావోయిస్టులు. రాష్ట్రంలో టిఆర్ఎస్ నేతల ఆగడాలు శృతి మించిపోతున్నాయని.. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. భూకబ్జాలకు పాల్పడే వారు తమ పద్ధతి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని లేఖను విడుదల చేశారు.
ప్రధానంగా టిఆర్ఎస్ నేతల భూకబ్జాలను సవాల్ చేస్తూ లేఖ విడుదలైంది. మావోయిస్టు పార్టీ నేత వెంకటేశ్ పేరుతో లేఖ బయటకు వచ్చింది. ఇకనైనా అధికార పార్టీ నేతలు పేదల భూములను కబ్జా చేయడం మానుకోవాలని లేదంటే ఊరుకోబోమని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో మావోయిస్టులు లేరని మకాం మార్చారని చెప్తూ వస్తుండగా… మరోసారి మావోయిస్టుల పేరిట లేఖ విడుదల అవ్వడం కలకలం రేపుతోంది.