మార్చి నెల వచ్చేసింది. ఫ్రెష్ గా సినిమాలు రెడీ అయ్యాయి. మరి మార్చిలో రిలీజ్ కు రెడీ అయిన సినిమాలేంటి? వాటిలో అంచనాలు పెంచే మూవీస్ ఏంటి ఓ లుక్కేద్దాం..
మార్చి మొదటి వారంలో.. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, బలగం, ఇన్ కార్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, బలగం సినిమాలపై అంచనాలున్నాయి. ఎస్వీ కృష్ణా రెడ్డి లాంగ్ గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం అన్నీ కృష్ణారెడ్డే.
ఇక దిల్ రాజు పెట్టిన కొత్త బ్యానర్ పై బలగం అనే సినిమా వస్తోంది. దిల్ రాజు ఓకే చేసిన ప్రాజెక్టు కాబట్టి విషయం ఉంటుందనేది అందరి నమ్మకం. రెండో వారంలో.. సీఎస్ఐ సనాతన్ అనే సినిమా వస్తోంది. ఈ ఏడాది ఆది సాయికుమార్ నుంచి వస్తున్న తొలి చిత్రం ఇదే. ఇదొక మర్డర్ మిస్టరీ. దీన్ని సనాతన్ ఎలా ఛేదించాడనేది స్టోరీ. ఈ మూవీతో పాటు మిస్టర్ కల్యాణ్ అనే చిన్న సినిమా వస్తోంది.
మూడో వారంలో.. కబ్జా, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలు పోటీ పడుతున్నాయి. ఉపేంద్ర హీరోగా నటించిన సినిమా కబ్జా. చంద్రు డైరక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటించింది. ఉపేంద్ర నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇదే. ఇక నాగశౌర్య, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. అవసరాల శ్రీనివాస్ డైరక్ట్ చేసిన ఈ సినిమాపై ఓ మోస్తరుగా అంచనాలున్నాయి. పీపుల్ మీడియా బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాత.
నాలుగో వారంలో.. నాని హీరోగా నటించిన దసరా సినిమా వస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి, మరో రంగస్థలం అవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక నెలకు ముగింపునిస్తూ, శివ కందుకూరి నటించిన భూతద్ధం భాస్కర్ నారాయణ కూడా వస్తోంది.
ఈ సినిమాలతో పాటు.. నేను స్టూడెంట్ సర్, ధమ్కీ, బెదురులంక సినిమాలు కూడా మార్చి నెలలోనే వచ్చే అవకాశం ఉంది.