పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అధికార పార్టీ ఉపాధ్యక్షురాలు మరియమ్ నవాజ్ తీవ్ర విమర్శలు చేశారు. అధికారాన్ని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నించారని ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని కాపాడాలంటూ చివరి నిమిషం వరకూ పాక్ ఆర్మీని బతిమాలారని విమర్శించారు. ఈ మేరకు ఆమె లాహోర్‌లో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.
అవిశ్వాస తీర్మానానికి పాక్ సుప్రీంకోర్ట్ అనుమతి ఇచ్చేవరకూ ఆయన ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. షెబాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ మధ్య వివాదంలో పాక్ ఆర్మీ దూరం పాటించిందని ఆమె గుర్తుచేశారు. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానంలో తనను గట్టెక్కించాలని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఉపాధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని కూడా బతిమాలారని మరియం విమర్శించారు.
రాజకీయాలంటే కప్పు టీ తాగినంత సులువు కాదని ఇమ్రాన్ క్రికెట్ ఆడటమే మంచిదని ఎద్దేవా చేశారు. ఇమ్రాన్ ఖాన్‌కు కష్టాలు వచ్చే రోజులు మొదలయ్యాయని మరియం ఆరోపించారు. ఒకవేళ నవాజ్ షరీఫ్ తిరిగి వస్తే ఇమ్రాన్ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఊహించుకోవాలన్నారు. ఇమ్రాన్ అవినీతిపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని, త్వరలోనే ఇమ్రాన్‌తోపాటు అతని మంత్రివర్గ సభ్యులు తిరుగులేని అవినీతి ఆరోపణలపై కటకటాల పాలవుతారని మండిపడ్డారు.
75 ఏళ్ల స్వతంత్ర్య పాకిస్థాన్ చరిత్రలో దాదాపు సగానికి పైగా ఆర్మీనే ఆ దేశాన్ని పాలించింది. ఇప్పటికీ దేశ భద్రత, విదేశాంగ విధానానికి సంబంధించి సైన్యమే కీలక నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇటీవల ఇమ్రాన్ ఖాన్‌కు షెబాష్ షరీఫ్‌కు మధ్య రాజకీయ వివాదాలు తలెత్తడంతో ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు సైన్యం నిరాకరించింది. ఇమ్రాన్‌ను గద్దె దించేందుకు ప్రతిపక్షాలు జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టారు. ఈ అవిశ్వాస తీర్మాణం నెగ్గడంతో ఇమ్రాన్ ఖాన్ ఏప్రిల్ 10న పదవి కోల్పోయారు. దీంతో పాకిస్థాన్ చరిత్రలో అవిశ్వాసం ఎదర్కొని పదవీచ్యుతుడైన తొలి ప్రధానికిగా ఇమ్రాన్ నిలిచారు.
ఇక, అవినీతి కేసుల్లో దోషిగా తేలిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.. పాక్ నుంచి పారిపోయి లండన్‌లో ప్రవాసం గడుపుతున్నారు. ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వంలో షరీఫ్ సోదరుడు షెహబాబ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంతో తిరిగి స్వదేశానికి వచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం ఆయనకు పాస్‌పోర్ట్ మంజూరు చేసింది.