తెలంగాణలోనూ మర్కజ్ ప్రార్థనల ఎఫెక్ట్ భారీగానే కనపడుతోంది. దేశవ్యాప్తంగా నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారికి కరోనా పాజిటివ్ అని తేలుతున్న నేపథ్యంలో… తెలంగాణ నుండి 1200మంది హజరయ్యారు. ఇందులో 160 మంది మినహా అందర్నీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
అయితే, ఆసుపత్రికి తరలించిన వారిలో 300మందికి మినహా అందరి పరీక్షల ఫలితాలు రాగా 30 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మరోవైపు తెలంగాణలో కరోనా వైరస్ తో బుధవారం ముగ్గురు చనిపోయారు. ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో, మరొకరు యశోధ ఆసుపత్రిలో మరణించినట్లు ప్రభుత్వం అర్ధరాత్రి ప్రకటన జారీ చేసింది.
కరోనా కేసులు తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిపోవటంతో… ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. రాత్రి పొద్దుపోయే వరకు సీఎం కేసీఆర్, మంత్రి ఈటెలతో పాటు ఇతర ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో పాటు వారి బంధువులు, వారు సన్నిహితంగా మెలిగిన వారందరికీ పరీక్షలు చేయాలని ప్రభుత్వం సూచించింది.