నగరంలో పోలీసులుపై దాడులు కలకలం రేపుతున్నాయి. దాదాపు వారం రోజుల క్రితం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సీపీఎస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, గిరిపై దుండగులు చేసిన దాడి ఘటన మరువక ముందే…సికింద్రాబాద్ మారేడుపల్లి ఎస్ ఐ వినయ్ కుమార్ పై దుండగులు కత్తితో దాడికి పాల్పడ్డారు.
ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎస్ఐ పై దుండగులు దాడికి పాల్పడ్డారు. మారేడుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్ ఐ వినయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో బైక్ పై వస్తున్న ఇద్దరిని ఎస్ ఐ ఆపి… వారిని ప్రశ్నించారు.ఈ క్రమంలో వారిలో ఓ వ్యక్తి తన వద్ద ఉన్న కత్తితో ఎస్ ఐ వినయ్ పై దాడి చేశాడు.
ఎస్ఐ ని కత్తితో కడుపు, వెన్నుభాగంలో పొడిచి ఇద్దరు పరారయ్యారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఎస్ఐని సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.సీఐ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. సరిగా వారం రోజుల క్రితం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దొంగలను పట్టుకునేందుకు మఫ్టీలో ఉన్న సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య, గిరిపై దుండగులు కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.
వరుసగా వారం రోజుల నుంచి పోలీసులపై కత్తులతో దాడి ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోలీసులపైనే కత్తితో దాడి చేసేందుకు కూడా దుండగులు వెనుకాడటం లేదు.అయితే రక్షణ కల్పించే పోలీసులపైనే దాడికి పాల్పడుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.