తమిళనాడులో వింతలకు కొదవలేదు. వీరాభిమానానికి అంతులేదు. సమాధి అంటే శుభ కార్యాలకు వేదిక కాదు. కానీ జయమ్మ వీరాభిమానులు దీన్ని తిరగరాశారు. అమ్మ సమాధి పచ్చని పెళ్ళిపందిరి అంటూ ఎంచక్కా కల్యాణ వేడుక జయలలిత స్మారకం దగ్గరే నిర్వహించారు.
చెన్నయ్: అమ్మకు గుడి కట్టి ఆరాధించే తమిళనాడు అన్నాడీఎంకే నేత ఎన్.భవానీ శంకర్ కుమారుడి కల్యాణం జయలలిత సమాధి సాక్షిగా అట్టహాసంగా జరిగింది. వధూవరులు ఎస్పీ సాంబశివరామన్, దీపిక వివాహం అమ్మ సమాధి దగ్గర బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా జరిగింది. జయలలిత సమాధిని పెళ్ళిమండపం మాదిరిగా పూలతో అలంకరించారు. జయ చిత్రపటాన్ని అమ్మవారి చిత్రపటంగా భావించి పూలమాల వేశారు. వరుడు వధువు మెడలో తాళికట్టి అమ్మ దీవెనలు అందుకున్నారు. ఇది వింత వేడుక. చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని ఆత్రేయ ఏనాడో అన్నారు. జయ సమాధి దగ్గర అన్నాడి.ఎం.కె. నేతల సమక్షంలో జరిగిన ఈ కల్యాణ వైభోగం చూస్తే అది నిజం అనిపించేలా వుంది.