పెళ్లి అన్నది సంస్కారమేనని, హిందూ ఫిలాసఫీ దీన్నే ప్రభోధిస్తోందని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే అన్నారు. అంతే తప్ప ఇది ఎంజాయ్ మెంట్ కోసం కాదని చెప్పారు. స్వలింగ వివాహాలపై అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా స్పందిస్తూ.. ఈ సమస్యపై కేంద్రం వైఖరితో ఆర్ఎస్ఎస్ ఏకీభవిస్తోందని స్పష్టం చేశారు.ఆడవారికీ, మగవారికీ మధ్య పెళ్లిళ్లు జరుగుతాయని, ఇది హిందూ లైఫ్ మ్యారేజ్ లో భాగమని చెప్పిన ఆయన..దీన్ని సంస్కారంగా భావించాలన్నారు.
ఇది కాంట్రాక్ట్ కాబోదు.. సహజీవనమన్నది వేరు.. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది.. ఓ కుటుంబానికి, సమాజానికి ఇది వారధిగా ఉంటోంది అని ఆయన వ్యాఖ్యానించారు. లైంగిక సుఖాల కోసం పెళ్లి అన్నదాన్ని తాను అంగీకరించబోనన్నారు. వరకట్నం వంటి దురాచారాల నిర్మూలన కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. స్వలింగ వివాహాలను గుర్తించాలని కోరుతూ కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. ఈ డిమాండును సవాలు చేస్తూ కేంద్రం కోర్టులో అఫిడవిట్ వేసింది.
స్వలింగ వివాహాల వల్ల దేశంలో, సమాజంలో పెద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడుతుందని, పర్సనల్ చట్టాల బ్యాలన్స్ దెబ్బ తింటుందని పేర్కొంది. ఒక మహిళకు, పురుషునికి మధ్య బాండ్ కి పెళ్లి అన్నదే గుర్తింపని మన దేశంలోని చట్టాలు చెబుతున్నాయని వివరించింది. ఇలా కేంద్రం స్వలింగ వివాహాలకు అభ్యంతరం చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు దీన్ని అయిదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది.
స్వలింగ వివాహాలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రభుత్వ వైఖరిని సమర్థించారు. అయితే కేంద్రం వైఖరిని ఎల్జీబీటీ సంఘాలు ఖండిస్తున్నాయి. దేశంలో బహుళత్వం, భిన్నత్వం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ భిన్న లింగాలకు మాత్రమే వివాహ హక్కు ఉంటుందని భావించడం శోచనీయమని, వివాహాల విషయంలో మైనారిటీలైన స్వలింగ సంపర్కులకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నాయి .