ఆ చిన్నారికి 12 ఏండ్లు. బడికెళ్లి చదువుకోవటం, స్నేహితులతో ఆడుకోవటం తప్ప ఏం తెలియదు. అలాంటిది ఆ బాలికను 35 ఏళ్ల వ్యక్తికి కట్టాబెట్టారు తల్లిదండ్రులు. వద్దని నచ్చజెప్పాలని చూసిన బంధువులతోనే వాగ్వాదానికి దిగారు. ఎవరికి అనుమానం రాకుండా.. పుట్టిన రోజు వేడుకల పేరుతో పెళ్లి తంతు కానిచ్చేశారు. ఈ అమానుష ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో ఆదివారం బాల్య వివాహం జరిగింది. 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో తల్లిదండ్రులు పెళ్లి జరిపించారు. పుట్టినరోజు వేడుకల పేరుతో బాలికకు పెళ్లి చేశారు. అయితే, తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లింది.
దీంతో బాలిక ఉన్న చోటుకు వచ్చి బంధువులతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆ పాప అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఇక చివరకు గ్రామస్థుల సాయంతో మొత్తంగా ఈ విషయం ఐసీడీఎస్ అధికారులకు తెలిపింది. తనకు బర్త్ డే పేరిట పెళ్లి జరిపించారని బాధిత బాలిక వివరించింది.
దీంతో ఐసీడీఎస్ అధికారులు పాపిరెడ్డిగూడ చేరుకుని బాలికను చేరదీశారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. అనంతరం ఐసీడీఎస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.