రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బోయినపల్లికి చెందిన అనూషకు అదే గ్రామానికి చెందిన మహేందర్ తో ప్రేమ వివాహం జరిగింది. గణ(3), మణి(1.5) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
మహేందర్ ఉపాధి కోసం ఎనిమిది నెలల క్రితం గల్ఫ్‌కు వెళ్లాడు. అప్పట్నుంచి అనూష తన అత్తామామలతో కలిసి ఉంటోంది. భర్త లేకపోవడంతో అత్తమామలు అనూషతో గొడవ పడే వారు. బుధవారం రాత్రి అత్తమామలు మరో సారి గొడవ పడ్డారు.
దీంతో మనస్తాపానికి గురైన అనూష.. ఆత్మహత్య చేసుకునేందుకు వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లింది. తాను లేకుండా తన పిల్లలను ఎవరు చూసుకుంటారనే ఆలోచనతో వెనక్కి తిరిగి వచ్చిన అనూష.. తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి బావిలో పడేసి.. తాను బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
గురువారం ఉదయం వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లిన వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను వెలికి తీసి పోస్ట్ మార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.