ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అత్యాచార బాధితురాలిని నిందితుడు పెండ్లి చేసుకున్నంత మాత్రాన అతనిపై నమోదైన కేసును కొట్టివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. బాధితురాలిని వివాహం చేసుకున్నంత మాత్రాన అతనికి బెయిల్ మంజూరు చేయడం కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది.
కేసు వివరాల్లోకి వెళితే… 2019 నవంబర్‌లో బాలిక(14)ను నిందితుడు(27) కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లి కిడ్నాప్ కేసు పెట్టింది. ఆ తర్వాత కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలించారు.
రెండేండ్ల తర్వాత 2021 అక్టోబర్‌లో బాలికను నిందితుడి ఇంటి వద్ద గుర్తించారు. బాలికకు అప్పటికే ఎనిమిదేండ్ల బాబు ఉన్నాడు. ఆచూకీ దొరికే నాటికి ఆమె మరోసారి ప్రెగ్నెన్సీతో ఉంది. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
బాలికను మాయమాటలతో ఆకర్షించి ఆమెపై అత్యాచారానికి పాల్పడటాన్ని సాధారణ నేరంగా పరిగణించలేమని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో బాధిత బాలిక అంగీకారం తెలిపిందా? లేదా? అనే అంశంతో సంబంధం లేదని కోర్టు పేర్కొంది. ఒక వేళ బాలిక తెలియని తనంతో అంగీకారం తెలిపినా చట్ట ప్రకారం దానికి గుర్తింపు లేదన్నారు.
బాధిత బాలికను తాను వివాహం చేసుకున్నానని, దానికి ఆధారాలు ఉన్నాయని నిందితుడు కోర్టుకు తెలిపాడు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. వివాహం చేసుకున్న సమయంలో ఆమె ఇంకా మైనరేనని పేర్కొంది. బాధిత బాలికను వివాహం చేసుకున్నంత మాత్రాన నిందితుడు పవిత్రుడు కాలేడని పేర్కొంది. ఈ మేరకు నిందితుడి బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.