కొద్ది రోజుల క్రితం మంచులో ఇరుక్కున్న కారును బయటకు తీయబోయి తీవ్రంగా గాయపడిన హాలీవుడ్ స్టార్ జెరేమీ రెన్నర్ తాజాగా తన ఇన్ స్టా అకౌంట్ లో ఓ ఫోటోను షేర్ చేశాడు. ఫిజియోథెరపి సెషన్ కు సంబంధించిన చిత్రాన్ని షేర్ చేస్తూ.. ప్రమాద సమయంలో తన శరీరంలోని 30 ఎముకలు విరిగిపోయానని వివరించాడు.
ప్రస్తుతం తాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యానని, ఇంట్లోనే ఫిజియోథెరపీ చేయించుకుంటున్నానని పేర్కొన్నాడు. ఒక విషాదకర సందర్భం నుంచి తాను, తన ఫ్యామిలీ తొందరగానే బయటపడ్డామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఒంట్లో 30 ఎముకలు విరిగినా అభిమానులు, కుటుంబసభ్యులు, మిత్రుల ఆశీర్వాదంతోనే త్వరగా కోలుకున్నానని పేర్కొన్నారు.
జెరేమీ రెన్నర్ ఈ ఏడాది జనవరి 1న తన ఇంటిముందు మంచులో ఇరుక్కుపోయిన బంధువు కారును వెలికితీసే ప్రయత్నంతో తీవ్రంగా గాయపడ్డాడు. కారుపై మంచును తొలగించి బయటికితీయబోయి ఆయన జారిపడ్డాడు.
ఈ ఘటనలో రెన్నర్ ఛాతికి, కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన పరిస్థితి మెరుగుపడటంతో ఇప్పుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు.