రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ పై వచ్చిన ఆరోపణలపై విచారణకు 5 గురు సభ్యులతో ‘ఓవర్ సైట్ కమిటీని’ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఒలంపియన్ బాక్సర్ మేరీ కోమ్ నేతృత్వాన ఈ కమిటీ విచారణ జరుపుతుందని వెల్లడించింది. . ఈ కమిటీలో ఒలంపిక్ మెడలిస్ట్ రెజ్లర్ యోగేశ్వర్ దత్, మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్, మిషన్ ఒలంపిక్ సెల్ మెంబర్ తృప్తి ముర్గుండే, టాప్స్ మాజీ సీఈఓ రాజగోపాలన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-టీమ్స్ రాధికా శ్రీమాన్ సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటిస్తూ.. ఇది నెల రోజుల పాటు రెజ్లింగ్ ఫెడరేషన్ రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుందన్నారు. బ్రిజ్ భూషణ్, కొందరు కోచ్ లు తమను లైంగిక వేధింపులకు, అవమానాలకు గురి చేశారని వినేష్ ఫొగత్, సాక్షి మాలిక్ వంటి రెజ్లర్లు ఆరోపించగా వారికి బజ్ రంగ్ పునియా, రవి దహియా వంటి ఇతర రెజ్లర్లు మద్దతు పలికారు.
ఈ కమిటీని ఏర్పాటు చేసినందున రెజ్లింగ్ ఫెడరేషన్ వ్యవహారాల్లో లో బ్రిజ్ భూషణ్ తన బాధ్యతలను నిర్వహించకుండా దూరంగా ఉంటారని, ఈ కమిటీయే ఈ బాధ్యతను స్వీకరిస్తుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సంస్థపైనా, దీని చీఫ్ పైన వచ్చిన అన్ని ఆరోపణల మీద ఈ కమిటీ విచారణ జరిపి ప్రభుత్వానికి తన నివేదికను సమర్పిస్తుందన్నారు.
ఈ సంస్థ చీఫ్ పదవికి రాజీనామా చేయబోనని మొదట ప్రకటించిన బ్రిజ్ భూషణ్.. తనమీద ఆరోపణలు చేసినవారిపైనే ఢిల్లీ హైకోర్టు కెక్కినట్టు తొలుత వార్తలు రాగా.. వాటిని ఆయన ఖండించారు. బీజేపీ ఎంపీ కూడా అయిన ఈయన తాజా పరిణామాల నేపథ్యంలో సైలెంట్ అయినట్టే అంటున్నారు.