భారత్ లో మాస్కుల వాడకం బాగా తగ్గిపోయిందని నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. ప్రస్తుతం మాస్కుల వాడకం 60శాతం లోపే ఉందని.. 2020 డిశంబర్ తరువాత ఇదే అత్యల్పమని అన్నారు.
ఓ వైపు ఒమిక్రాన్ వేరియంట్ ముంచుకొస్తుంటే.. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదని ఆయన అన్నారు. కరోనా మొదటి వేవ్ తరువాత 2021 జనవరి, ఫిబ్రవరిలో కేసులు తగ్గుముఖం పట్టడంతో మాస్కుల వాడకం బాగా తగ్గిందని.. అప్పుడు సుమారు 60 శాతంకు పైగా ఉండేదని అన్నారు. తరువాత మే, జూన్ నాటికి కేసులు సంఖ్య పెరగటంతో మాస్కులు వాడకం కూడా గరిష్టంగా 80శాతంకు చేరిందని అన్నారు. ఈ విషయాలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ (IHME) నుండి డేటా ఆధారంగా ఓ గ్రాఫ్ ను చూపించారు.
ఇటువంటి సామాజిక అజాగ్రత్త వల్ల గతంలో చాలా నష్టపోయామని.. సెకండ్ వేవ్ లో కరోనా పెద్ద విధ్వంసమే సృష్టించిన విషయాన్ని పాల్ గుర్తు చేశారు. మాస్కులతో కలిసి జీవించాలని.. వాటిని వదిలించుకొనే సమయం ఇంకా రాలేదని వీకే పాల్ తెలిపారు.
మాస్క్ అనేది “యూనివర్సల్ సోషల్ వ్యాక్సిన్” అని.. టీకాలు వేసినప్పుడు కూడా మాస్క్ ధరించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. పెండ్లిళ్లు, వేడుకల్లో తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. ఒమిక్రాన్ సోకిన చాలామందిలో మోస్తరు లక్షణాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించినట్టు లవ్ అగర్వాల్ తెలిపారు.