కృష్ణా జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కలకలం రేపుతోంది. జిల్లాలోని గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు.. పక్కనే ఉన్న పామర్రు మండలం పసమర్రు జిల్లా పరిషత్ పాఠశాల నుంచి పదో తరగతి పరీక్షకు సంబంధించిన సమాధానాల స్లిప్‌లను పరీక్షా కేంద్రానికి పంపుతున్నట్లు ఫిర్యాదులు అందాయి.
సమాచారం అందుకున్న విద్యాశాఖ, పోలీస్ అధికారులు పసుమర్రు జిల్లా పరిషత్ పాఠశాలకు చేరుకున్నారు. కొందరు ఉపాధ్యాయుల వద్ద సెల్ఫోన్లో సమాధానాలను విద్యాశాఖ అధికారులు గుర్తించారు. పసుమర్రు హైస్కూల్ నుంచి ప్రశ్నపత్రాల సమాధానాలు వెళ్తున్నాయని టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం వచ్చిందని డీఈవో తాహిరా సుల్తానా వెల్లడించారు.
పాఠశాలలో ఐదుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. నాలుగు మొబైల్ ఫోన్లలో సమాధానాలు గుర్తించి పోలీసులకు అప్పగించామని తెలిపారు. పోలీసుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల ఫోన్లలో ‘పేపర్ టైట్, అయాం వెయిటింగ్’ అన్న మెసేజ్‌లు ఉన్నాయని స్క్వాడ్ అధికారులు తెలిపారు. తాము గుర్తించిన సమాచారాన్ని పోలీసులకు అందించామని… విచారణ అనంతరం పూర్తి వివరాలు పోలీసులు వెల్లడిస్తారని స్పష్టం చేశారు తాహిరా సుల్తానా.