తెలంగాణలో బైపోల్, మూకుమ్మడి రాజీనామాలు?

తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సోమవారం అసెంబ్లీలో జరిగిన ఘటనపై శాసనసభ, మండలిలో కాంగ్రెస్ సభ్యులపై సభాపతులు వేటు వేశారు. అంతేకాదు ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో బైపోల్ హంగామా మొదలుకానుంది. దీంతో మిగతా కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా రాజీనామాలు చేస్తే ఎలావుంటుందన్న దానిపై రాజనీతి నిపుణులతో సంప్రదింపులు మొదలుపెట్టారు.

అసెంబ్లీలో సభ్యులందరిపై వేటు వేయడం దారుణమని కాంగ్రెస్ నేతలు వాపోయారు. బడ్జెట్‌లో లోపాలు ఎత్తిచూపుతామనే భయంతోనే సభలో తమని లేకుండా చేస్తున్నారని, ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేస్తున్నారని అన్నారు ప్రతిపక్షనేత జానారెడ్డి. సీఎం కేసీఆర్‌ కనుసన్నల్లో నాటకాలాడుతున్నారని, ప్రధాన ప్రతిపక్షాన్ని అసెంబ్లీ నుంచి గెంటేశారని ఆరోపించారు. ఇదిలావుంటే ఈ సమయంలో ఉప ఎన్నికలొస్తే తెలంగాణలో రాజకీయ పరిస్థితి ఎలా వుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

కోమటిరెడ్డి వెంకటిరెడ్డి(నల్గొండ), సంపత్ (ఆలంపూర్) సభ్యత్వాల రద్దుతో ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక దాదాపు ఖాయమైనట్టే! కానీ, ఎలక్షన్ కమిషన్ వెర్షన్ ఎలా వుందనేది కూడా కీలకం. వీళ్లతోపాటు జానారెడ్డి అండ్ కో మొత్తం పౌరుషంతో రాజీనామాల బాట పడితే ఫలితం ఎలా వుంటుంది, ప్రస్తుతం తెలంగాణలో ఓటరు నాడి ఎలా వుంది.. కేసీఆర్ చేయించారంటున్న సర్వేల సంగతేంటి? లాంటి అంశాలన్నీ అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చర్చకు తావిస్తున్నాయి. తెలంగాణలో మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని ఒకప్పుడు చేసిన ప్రతిపాదనను కేసీఆర్ ఇప్పుడు ఆచరణలో పెట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు కొందరు.