తమ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినందుకు నిరసనగా ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆదివారం సామూహిక సత్యాగ్రహం ప్రారంభించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ‘మహా ధర్నా’ సాయంత్రం 5 గంటలవరకు కొనసాగనుంది. అయితే రాజ్ ఘాట్ వద్ద నిరసన తెలిపేందుకు వీరిని పోలీసులు అనుమతించలేదు. అక్కడ 144 సెక్షన్ విధించారు.
ఈ ప్రాంతంలో ఆక్షలున్నప్పటికీ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సీనియర్ నేతలు ప్రియాంక గాంధీ, కేసీ. వేణుగోపాల్, జైరాం రమేష్ తదితరులు అక్కడికి చేరుకున్నారు. రాహుల్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో తన స్టేటస్ ని ‘డిస్’ క్వాలిఫైడ్ ఎంపీ గా మార్చడం విశేషం.
దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, జైలుకు వెళ్తానన్న భయం తనకు లేదని ఆయన నిన్న ప్రకటించారు. ఈ ప్రభుత్వానికే తనంటే భయమని ఆయన పేర్కొన్నారు. కేసులకు బెదిరే ప్రసక్తి లేదన్నారు.
ఇక అన్ని రాష్ట్రాల్లో గాంధీజీ విగ్రహాల వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సత్యాగ్రహ దీక్షలకు కూర్చున్నారు. జిల్లా ప్రధాన కేంద్రాల వద్ద కూడా ధర్నాలు నిర్వహించాలని పార్టీ శాఖలు ఇదివరకే నిర్ణయించాయి.