జమ్మూ కశ్మీర్ లోని సోనామార్గ్ లో ప్రకృతి అందాలు ఓవైపు కనువిందు చేస్తుంటే.. మరోవైపు మంచు శిఖరాలు విరిగి పడుతూ భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఎప్పుడేం ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. నిన్న ఇక్కడ మంచుతో కూడిన కొండ చరియ విరిగిపడి బీభత్సం సృష్టించింది. కేవలం రెండు రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి.
సోనామార్గ్ లో నిర్మాణాలు చేపడుతున్న ఓ కంపెనీ బరాక్స్ వద్ద పని చేస్తున్న కార్మికులు విరిగి పడిన మంచు శిఖరాన్ని చూసి భయంతో చెల్లాచెదురయ్యారు. . చూస్తుండగానే పై నుంచి ‘మంచు సునామీ’ ఒక్కసారిగా విరుచుకుపడడంతో వీరంతా హాహాకారాలు పెడుతూ దగ్గరలోని బిల్డింగ్ లోకి పరుగులు తీశారు. తెల్లని మంచు మేఘాలు అక్కడి పరిసరాలను, బరాక్ లను కప్పేశాయి.
ఈ దృశ్యాలు వీడియోకెక్కాయి. కొద్దిసేపటికి ఆ ప్రాంతమంతా మంచు దుప్పటి పరచుకుంది. శీతల పెనుగాలులు వాతావరణాన్ని మరింత శీతలం చేశాయి. ఈ నెల 13 న ఇక్కడే .. సోనామార్గ్ లోనే కొండచరియలు విరిగిపడి ఇద్దరు కార్మికులు మరణించారు.
సెంట్రల్ కశ్మీర్ లోని గండెబల్ జిల్లా .. బల్తాల్ సమీపంలో ఉందీ సోనామార్గ్.. దట్టమైన మంచు కురుస్తున్న ఫలితంగా అధికారులు ‘హై అవలాంచీ వార్నింగ్’ జారీ చేశారు. కశ్మీర్ అంతా ఇప్పుడు ‘చిల్లాల్ కలాన్’ అనే వాతావరణ ‘సునామీ’ లో చిక్కుకుంది. ఇది 40 రోజులు ఉంటుందట.. స్నో ఫాల్ సీజన్ గా దీన్ని వ్యవహరిస్తున్నారు.