మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం పై రాష్ట్ర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మత్తుపదార్థాలతో పాటు గంజాయి సరఫరాను ఎక్కడికక్కడ నియంత్రించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాలపై పోలీసులు ఓ కన్నేసి ఉంచుతున్నారు.
అయినా కాని రోజూ ఏదో చోట మాదకద్రవ్యాలు, గంజాయి పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లో భారీగా మాదకద్రవ్యాలు, గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముంబైకి చెందిన నలుగురు స్మగ్లర్లను హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ముఠా సభ్యుల నుంచి 204 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.
స్మగ్లర్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే నగరంలోని పలువురు ప్రముఖులకు మాదకద్రవ్యాలను సరఫరా చేసేందుకు ఈ ముఠా ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.మరోవైపు నగరంలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ ముఠా నుంచి 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయిని తరలిస్తున్న కారును సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రముఖులకు మాదకద్రవ్యాలను సరఫరా చేయడానికి అంతర్ రాష్ట్ర మాదకద్రవ్యాల ముఠాలు నగరానికి తరుచుగా వస్తుండడం సర్వసాధారణంగా మారిపోతుంది. దీంతో ఇకనైనా స్మగ్లర్లతో పాటు వినియోగిస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు చేపడితే కాని ఈ మత్తును వదలించలేమన్న వాదన పెరుగుతోంది.