పాకిస్తాన్, ఆఫ్గనిస్థాన్ దేశాలను భూకంపం కుదిపివేసింది.రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత 6.8 గా నమోదయింది. మంగళవారం తెల్లవారుజామున భూకంప ధాటికి పాక్ లోని ఖైబర్ పక్తున్ క్వా సమీపాన స్వాత్ లోయలో 11 మంది మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్, జీలం, నౌషేరా, వంటి అనేక నగరాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఆఫ్ఘనిస్థాన్ ని కూడా ఈ విలయం వణికించింది. ఈ ఉదయం తిరిగి 4.4 మ్యాగ్నిట్యూడ్ తో అక్కడక్కడా భూమి కంపించింది. ఈ దేశంలోని హిందూ కుష్ లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
ఇండియాలో ఉత్తరాదిన ఢిల్లీ, పంజాబ్,హర్యానా, చండీగఢ్, యూపీ, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లోని పలు నగరాలు భూకంప ప్రకంపనలతో తల్లడిల్లాయి. ఇళ్లల్లోని సీలింగ్ ఫ్యాన్లు, ఇతర వస్తువులు ఊగిపోతున్న దృశ్యాల తాలూకు వీడియోలను అనేకమంది ట్విట్టర్ లో షేర్ చేశారు.
ఢిల్లీ నార్త్ క్యాంపస్ లో పలువురు విద్యార్థులు బయటకు వచ్చేశారు. గురుగ్రామ్ లో ఓ భవనమంతా భూకంప ధాటికి దాదాపు కూలిపోతుందా అన్న స్థితికి వచ్చింది. ప్రకంపనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.