హైదరాబాద్ రాంగోపాల్ పేట్ లో గురువారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. డెక్కన్ నైట్ వేర్ స్టోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ కమ్మేసింది. అగ్నిప్రమాదం జరిగిన చోట కొందరు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టి అగ్నిమాపక సిబ్బంది కాపాడారు.
భారీ క్రేన్ సాయంతో ముగ్గురిని కిందకు తీసుకువచ్చారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో మంటలను అదుపు చేయడానికి చాలా టైమ్ పడుతోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. ప్రమాదంలో దుకాణంలో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయి.
షాపు వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించారు. భవనం పక్కనే ఉన్న నివాసాలకు పొగ వ్యాపించింది. దాంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మంటలను ఆర్పేందుకు మూడు ఫైర్ ఇంజన్లను ఉపయోగించారు. భవనం ముందు ట్రాఫిక్ ను పోలీసులు నిలిపివేయడంతో కాసేపు భారీగా ట్రాఫిక్ స్తంభించింది.