యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ధర్మోజిగూడలోని ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఉదయం ఫ్యాక్టరీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా… నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి పరిశ్రమ మొత్తానికి విస్తరించాయి.
రసాయన పరిశ్రమ కావడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల భారీగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన కార్మికులు వెంటనే బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది.