ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కేవలం ఒక్క రోజులోనే 10టీఎంసీల నీరు వచ్చి చేరిందంటే వరద ఉధృతి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. కృష్ణానదిలో ఉన్న భారీ వరదను దృష్టిలో పెట్టుకొని జూరాల ప్రాజెక్టులో 28 గేట్లు ద్వారా లక్షా 98వేల క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా మరో 22 వేల 743 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలానికి వరద పోటేత్తుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులో 24 గంటల వ్యవధిలోనే… 14.21 టీఎంసీల మేర నీటి నిల్వ పెరిగినట్లు అధికార వర్గాలు దృవీకరించాయి.
శనివారం సాయంత్రం 6 గంటల వరకు శ్రీశైలంలో 79.81 టీఎంసీల నీరు ఉండగా… ఆదివారం సాయంత్రానికి 94.02 టీఎంసీలకు చేరుకున్నాయి. శ్రీశైలానికి 2లక్షల 13 వేల 486 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా… 40 వేల 259 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. తుంగభద్ర నదిలో భారీగా వరద ఉండటంతో… ఇన్ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని, ఇలా అయితే రెండు మూడు రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తిగా నిండనుంది. దీంతో ఎగువ నుండి వచ్చేవరదకు అనుగుణంగా నాగార్జున సాగర్ కు అధికారులు నీటి విడుదల ప్రవాహాన్ని పెంచనున్నారు.