– పథకం అమలు విషయంలో రెండేళ్లలో విపరీతమైన అవకతవకలు.
– సవరించిన అంచనా వ్యయం రూ.98 వేల కోట్లు.
–గత ఆర్ధిక సంవత్సరం కన్నా 25 శాతం తక్కువ.
–బడ్జెట్ అంచనాల కంటే సవరించిన అంచనా వ్యయమే ఎక్కువ
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశ వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా అమల్లో ఉంది. దీంతో ప్రతీ కుటుంబానికి 100 రోజుల పని దినాలను కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే.. ఈ పథకం అమలులో గత రెండేళ్లలో విపరీతమైన అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే వీటి అమలు కఠినతరం చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించిన ప్రభుత్వం. ఈ పథకానికి బడ్జెట్ నిధుల్లో భారీగా కోత పెట్టింది. సవరించిన అంచనా కంటే దాదాపు రూ.25వేల కోట్లను తగ్గించింది కేంద్రం.
ఈ పథకానికి సంబంధించి 2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.73 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనా వ్యయం రూ.98 వేల కోట్లు. అంటే దానికంటే ఇది 25 శాతం తక్కువ. అయితే.. గత రెండేళ్లుగా బడ్జెట్ అంచనాల కంటే సవరించిన అంచనా వ్యయం ఎక్కువగా ఉంటోంది. ఈ సమయంలో పథకం అమలులో భారీగా అవకతవకలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్టు తెలుస్తోంది.
డీబీటీ పద్ధతిలో లబ్ధిదారులకే నేరుగా నగదు బదిలీ జరుగుతోంది. కానీ.. ఈ వ్యవస్థలో కొంత మానవ ప్రమేయం కూడా ఉన్నట్టు కేంద్రం గ్రహించినట్టు సమాచారం. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో పేరు నమోదు చేస్తామని మధ్యవర్తులు ప్రలోభాలకు గురిచేస్తున్నారనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంకులో నగదు జమ అయిన తర్వాత వాటిని తిరిగి ఇవ్వాలంటూ చెప్తున్నారు. ఈ తరహాలో కుంభకోణం భారీ స్థాయిలో జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. ఈ విధంగా అసలు పని జరగకుండానే మధ్యవర్తుల చేతిలోకి నగదు వెళ్తోందనే అనుమానాలు కూడా వ్మక్తం అవుతున్నాయి.
ఇటువంటి ప్రలోభాల వల్ల భారీస్థాయిలో డబ్బు వృథా అవుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నారు. అందుకే ఇటువంటి వాటిని తగ్గించేందుకు పథకం అమలు కఠినతరం చేస్తున్నట్లు వెల్లడించాయి. అంతేకాకుండా గత రెండేళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరిస్తోందని అధికారులు చెప్తున్నారు. 2020-21 ఏడాదిలో రూ.1.11 లక్షల కోట్లు ఖర్చుపెట్టగా.. ఇది బడ్జెట్ అంచనాల కంటే దాదాపు రూ.61 వేల కోట్ల అధికం. అదే 2014-15లో ఈ వ్యయం రూ.35 వేల కోట్లుగా ఉందని ఓ కీలక అధికారి వెల్లడించారు.