జులాయి సినిమాలో బ్యాంకును దోచుకునే సీన్ గుర్తుండే ఉంటుంది. కాస్త అటూ ఇటుగా నిజామాబాద్ జిల్లాలో అలాంటి సీనే రిపీట్ అయింది. మెండోర మండలం బుస్సాపూర్ గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీ జరిగింది. దుండగులు షట్టర్లను రాడ్లతో పైకిలేపి లోపలికి ప్రవేశించారు.
బ్యాంకులో ఉన్న స్ట్రాంగ్ రూమును గ్యాస్ కట్టర్ తో కట్ చేసి లోపలికి ప్రవేశించారు దొంగలు. లాకర్లలో ఉన్న రూ.7.30 లక్షల నగదు, రూ.3కోట్ల విలువైన బంగారు నగలు దోచుకెళ్లారు. ఉదయం బ్యాంక్ సిబ్బంది వచ్చి షట్టర్లు తెరిచి ఉన్నట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనేనని అనుమానిస్తున్నారు పోలీసులు. బ్యాంకులోని అలారం సెన్సార్ ను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు దొంగలు. అలాగే బ్యాంకులో ప్రవేశించే సమయంలో మాస్కులు వాడారు. చోరీ తర్వాత సీసీ కెమెరాకు సంబంధించిన డివిఆర్ ను సైతం ఎత్తుకుపోయారు.
ఘటనా స్థలాన్ని నిజామబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు పరిశీలించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇటీవల కాలంలో బ్యాంకులలో ఇంత పెద్దచోరీ జరగడం ఇదే మొదటిసారి. దొంగల ముఠా కోసం ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టింది పోలీస్ శాఖ.