బీహార్ లో సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 73 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన క్రైం బ్రాంచ్ పోలీసులు కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిని రామ్ బాబు మహతోగా గుర్తించారు.
సరన్ జిల్లాలోని డోయిలా అతని స్వగ్రామం. నిందితుడు మహతో ఢిల్లీలో ఉన్నట్లు తమకు సమాచారం అందిందని కమీషనర్ రవీంద్ర సింగ్ యాదవ్ తెలిపారు.టెక్నికల్ నిఘా, ఆ తర్వాత నిర్దిష్ట సమాచారం ఆధారంగా మహతోను ద్వారక ప్రాంతంలో పట్టుకున్నట్లు యాదవ్ వెల్లడించారు.
నిందితుడు మహతోను అరెస్టు చేసిన విషయాన్ని బీహార్ పోలీసులకు తెలియజేసినట్లు ఢిల్లీ కమీషనర్ తెలిపారు. బీహార్‌లో మద్య నిషేధం ఉందని, అయితే ఆ అవకాశాన్ని వాడుకుని, త్వరగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో నిందితుడు కల్తీ మద్యం అమ్మకాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.